
బాహుబలి రివ్యూ
| |
రేటింగ్ :
|
3/5
|
దర్శకత్వం :
| ఎస్ ఎస్ రాజమౌళి |
సమర్పణ :
| కె రాఘవేంద్ర రావు |
నిర్మాత :
| శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని |
ఛాయాగ్రహణం :
| సెంథిల్ కుమార్ |
నటీ నటులు:
|
ప్రభాస్
రానా అనుష్క తమన్నా నాజర్ తదితరులు. |
సంగీతం :
| ఎం ఎం కీరవాణి |
విడుదల : | 10 జూలై 2015 |
రెండున్నర సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకొని భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం బాహుబలి . ఇక ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .
కథ :
మాహిష్మతి రాజ్యంలో రాజు చనిపోవడంతో రాజమాత శివగామి (రమ్యకృష్ణ ) పాలనా బాధ్యతలను నెత్తిన వేసుకుంటుంది . మాహిష్మతి రాజు తనయుడైన అమరేంద్ర బాహుబలి (ప్రభాస్ ) తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో ఆ పసివాడిని అక్కున చేర్చుకుంటుంది రాజమాత శివగామి , అయితే అదే సమయంలో రాజు లేని రాజ్యాన్ని ఆక్రమించడానికి మాహిష్మతి సామంతరాజులు దుష్టపన్నాగం పన్నగా తమ సైన్యాధికారి కట్టప్ప (సత్యరాజ్ ) పోరాట పటిమ ,శివగామి రాజనీతి వల్ల ఆ ఉప ద్రవం నుండి బయట పడతారు . శివగామి తనయుడు భల్లాల దేవా (రానా ) బాహుబలి (ప్రభాస్ ) లు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత బాహుబలి ,భల్లాల దేవ లలో ఎవరు రాజ్యాన్ని అధిరోహించాలో నిర్ణయించి బాహుబలి ని రాజుగా ప్రకటిస్తుంది శివగామి . అయితే రాజ్య కాంక్ష పుష్కలంగా ఉన్న భల్లాల దేవ మాహిష్మతి మహారాజు అవుతాడు . అతని రాజ్యంలో పాతికేళ్ళుగా బానిసలా పడి ఉంటుంది దేవసేన (అనుష్క ). ఆమెని విడిపించడానికి అవంతిక (తమన్నా ) చేస్తున్న ప్రయత్నాలకు ఆమె ప్రేమికుడు శివుడు (ప్రభాస్ ) తనవంతు బాధ్యతగా దేవసేన ని విడిపించడానికి మాహిష్మతి రాజ్యానికి వెళతాడు . దేవసేన ని విడిపించి తీసుకొస్తున్న సమయంలో శివుడి కి నేను ఎవరు ? దేవసేన కు ఎమౌతాను ? బాహుబలి ఏమయ్యాడు ? తదితర విషయాలు తెలియాలంటే బాహుబలి చిత్రాన్ని చూడాల్సిందే .
నటీనటుల ప్రతిభ :
బాహుబలి గా శివుడి గా ద్విపాత్రాభినయం పోషించిన ప్రభాస్ ఆ రెండు పాత్రలను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పోషించి ప్రేక్షకుల చేత మెప్పించాడు . బాహుబలి గా వీరత్వాన్ని ,శూరత్వాన్ని ప్రదర్శించి భేష్ అనిపించాడు . బాహుబలి పాత్రకు తెలుగులో నేను తప్ప మరొకరు లేరు రారు అన్నట్లుగా తన ఆహార్యాన్ని ప్రదర్శించాడు . అలాగే శివుడి పాత్ర లో కూడా పరకాయ ప్రవేశం చేసిన ప్రభాస్ కు బాహుబలి నిజంగా తన నట జీవితంలో మరిచిపోని మరుపురాని చిత్రంగా నిలుస్తుందనడం లో సందేహం లేదు .
భాలలాల దేవ గా రానా ప్రతినాయక పాత్రలో మెప్పించాడు . బాహుబలి కి తగ్గ ప్రతినాయకుడు అంటే ఇలానే ఉండాలి అనిపించేలా రానా ఆహార్యం ఉండటం ఈ చిత్రానికి మరో ఆకర్షణ . బాహుబలి ని దెబ్బ కొట్టి మాహిష్మతి రాజ్యానికి రాజు ని కావాలని ఆశించే సన్నివేశాల్లో రానా నటన బాగుంది . పోరాట సన్నివేశాల్లో రానా మరింతగా రాణించాడు . ఇక తనదైన శైలి లో బాహుబలి ని మరోసారి కసితీరా చంపాలనే డైలాగ్ ని చెప్పి నటన లోనే కాదు డైలాగ్స్ లో కూడా నాది అందెవేసిన చెయ్యి అని నిరూపించాడు .
శివగామి పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోసారు . రాజమాత గా తనదైన నటన ని ప్రదర్శించి భేష్ అనిపించారు . రాజమాత లోని పౌరుషాన్ని ,హుందాతనాన్ని చక్కగా చూపించి అసలు సిసలు రాజమాత గా జీవించారు .
దేవసేన గా అనుష్క కనిపించింది తక్కువ సేపే అయినప్పటికీ కథలో కీలక పాత్ర కావడంతో ఆ క్యారెక్టర్ పై అటెన్షన్ తప్పక ఉంటుంది . డీ గ్లామరైజ్ క్యారెక్టర్ ని పోషించి దేవసేన గా మెప్పించింది అనుష్క .
అవంతిక గా కనిపించిన మిల్కీ బ్యూటీ కిది ఖచ్చితంగా వెరైటీ రోల్ అని చెప్పక తప్పదు . ఇన్నాళ్ళు గ్లామర్ నే ఒలకబోసిన ఈ భామకు ఈ చిత్రంలో గ్లామర్ తో పాటు పోరాటాలు చేసే చాన్స్ కూడా రావడంతో తన సత్తా చాటుకుంది తమన్నా . శృంగారాన్ని ఒలికించడమే కాకుండా రౌద్రన్ని కూడా ప్రదర్శించి భేష్ అనిపించింది .
ఇక మిగిలిన పాత్రల్లో కట్టప్ప గా సత్యరాజ్ ,బిజ్జల దేవ గా నాజర్ ,కాలకేయ గా ప్రభాకర్ లు తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు .
హైలెట్స్ :
ఎం ఎం కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సెంథిల్ కుమార్ అందించిన ఫోటోగ్రఫీ
విజువల్స్
డ్రా బ్యాక్స్ :
భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ బాహుబలి చిత్రంలో డ్రా బ్యాక్స్ కూడా బోలెడు ఉన్నాయి . హైలెట్స్ ఎన్ని ఉన్నాయో డ్రా బ్యాక్స్ కూడా అన్నే ఉన్నాయి . చందమామ కథల్లో లాగా హీరో చేసే అరుదైన ఫీట్ లు చూస్తే ముక్కున వేలేసు కోవడం ఖాయం . అలాగే కథ కూడా గొప్పదేం కాదు ఎన్నో సినిమాల్లో వచ్చినట్లుగానే ఈ చిత్రం కూడా రివేంజ్ డ్రామా గా తెరకెక్కింది . అయితే జక్కన్న తన ప్రతీ సినిమాలో ఓ కొలమానం పెట్టుకొని ఇన్ని నిమిషాలకు లేదా సినిమా గ్రాఫ్ పడిపోతోంది అని అనుకున్న సమయంలో ఓ ట్విస్ట్ ఇవ్వడమో లేక హీరో యిజం పెంచే సన్నివేశాలు పెట్టడమో లేక గుండెల్ని పిండేసే సీన్స్ తో సినిమాని మరో మెట్టు ఎక్కించడం జక్కన్న నైజం . ఈ చిత్రంలో కూడా అలాగే కొన్ని నియమాలు పెట్టుకున్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది కలిసి రాలేదు ఇక సినిమా నిడివి కూడా ఎక్కువ కావడంతో బోర్ ఫీల్ అవుతారు ప్రేక్షకులు . భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను మాత్రం అందుకోలేక పోయింది . అయితే విజువల్ వండర్ అని మాత్రం చెప్పవచ్చు .
సాంకేతిక వర్గం :
బాహుబలి వంటి భారీ చిత్రాన్ని విజువల్ వండర్ గా చూపించిన వాళ్ళలో అగ్ర తాంబూలం సాంకేతిక నిపుణులదే . దర్శకుడి ఊహలకు అనుగుణంగా సంగీతం అందించారు ఎం ఎం కీరవాణి . పాటల్లోనే కాకుండా రీ రికార్డింగ్ లో కూడా బలమైన ముద్ర వేసారు కీరవాణి . తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ,పాత్రలను మరింతగా ఎలివేట్ చేసాడు .
సెంథిల్ కుమార్ విషయానికి వస్తే అతడి కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే ! రాజమౌళి ఆలోచనలకూ దృశ్య రూపం ఇచ్చి విజువల్ ఫీస్ట్ ని అందించాడు . ఇక దర్శకులు రాజమౌళి విషయానికి వస్తే ముందుగా ఇంతటి భారీ చిత్రాన్ని భుజ స్కంధాలపై ఎత్తుకోవాలి అని ఆలోచన రావడమే గొప్ప విషయం . అనుకున్నంత ఎఫెక్టివ్ గా సినిమా లేకపోయినా బాహుబలి తో దశ దిశలా తెలుగువాడి ఖ్యాతి పరిడవిల్లెలా చేసిన ఖ్యాతి ముమ్మాటికీ జక్కన్న దే . మేకింగ్ బాగున్నప్పటికీ జక్కన్న అనుకున్నది తెరమీద కు వచ్చిందా లేదా అన్నది చూడాలి . కథ గా ఏమి లేదు కానీ విజువల్ తో కొట్టాలని చూసిన జక్కన్న కొన్ని సన్నివేశాల్లో మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే నూటికి నూరు శాతం బాగుండేది .ఖర్చుకు వెనుకాడకుండా అన్న పదానికి సరైన నిర్వచనం ఇచ్చిన నిర్మాతలు ఈ చిత్ర నిర్మాతలు . దర్శకుడికి ఏమి కావాలో అవన్నీ సమకూర్చి బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తీసి తమ అభిరుచి ఏంటో చూపించారు నిర్మాతలు .
విశ్లేషణ :
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడు అనగానే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనడం సహజం ,ఇక రెండున్నర సంవత్సరాల పాటు ఈ చిత్రాన్ని చెక్కారు అని అనగానే సహజంగానే భారీ అంచనాలు నెలకొనడం ఖాయం . అందుకు తగ్గట్లుగానే రెండు నెలలుగా బాహుబలి ఫీవర్ తో ఊగిపోతున్నారు అటు ప్రేక్షకులు ఇటు పలువురు ప్రముఖులు . ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రేంజ్ లో తెరకెక్కిన బాహుబలి చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ విజువల్ గా చాలా రిచ్ గా ఉండటంతో ఒకసారి ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూడవచ్చు .
Post a Comment